తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, February 24, 2008

లావొక్కింతయు లేదు...


ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్ళన్నీ స్లాబులే కానీ నేను పుట్టి పెరిగిన ఇల్లు పెంకుటిల్లు. పెంకుటిళ్ళకి వాసాలుంటాయి. ఆ వాసాలకి చీర వేళాడదీసి సులువుగా ఉయ్యాల వేసేవారు. ఆ ఉయ్యాలలో చిన్నపిల్లల్ని ఊపుతూ నిద్రపుచ్చేవారు. అలా నిద్రపుచ్చుతూ జోలపాటలు పాడేవారు.

మా చిన్నప్పుడు మా తాతయ్య మమ్మల్ని నిద్రపుచ్చుతూ పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం పద్యాలు చదివేవారట. అంచేత ఆ పద్యాలు ఊహ తెలియనప్పటినుంచి కూడా మనసు మూలల్లో ఎక్కడో నాటుకు పోయాయి. అందుకే బహుశా ఆ పద్యాలు విన్నప్పుడూ, చదువుకున్నప్పుడూ కాళిదాసన్న "జననాంతర సౌహృదాని"వంటి భావనేదో ఆవరిస్తుంది.



లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!


ఆ గజేంద్రుడెవడు? నేనెవరిని? ఈ పద్యాన్ని ఎలుగెత్తి చదివితే ఎందుకు నా గుండె ద్రవిస్తుంది? అది నా బాధేనా అన్న అనుభూతి ఎందువల్ల? ఇదంతా అలోచిస్తే చాలా విచిత్రంగా తోస్తుంది!

గజేంద్రుడు మొసలితో కొన్ని వేల యేళ్ళు యుద్ధం చేసాడట, ఇది సాధ్యమేనా? కాదు. అవును, ప్రతీకాత్మకంగా.

కష్టాలొచ్చినప్పుడు, ఒక నెల రోజులైనా, కొన్ని వేల సంవత్సరాల్లా గడవడం సాధరణ విషయమే. ఆ సమయంలో దేవుడి మీద నమ్మకం ఉన్నవారు (కొందరు లేనివారు కూడా కలిగించుకొని) ఇలా కుయ్యి పెట్టడం కుడా తెలిసిన విషయమే. పై అవస్థ దీనికి ప్రతీక.

మరొక రకంగా ఆలోచిస్తే, సమస్త మానవ జాతీ వేన వేల సంవత్సరాలుగా ఎదో ఒక సంఘర్షణ పడుతూనే ఉంది. అలాటి ఒకానొక సందర్భంలో దేవుడనే ఒక నమ్మకంపై ఆధారపడాల్సిన సన్నివేశం తటస్థించింది. పై అవస్థ దీనికి కూడా ప్రతీకే!

మా తాత తెలుగు పండితుడు కాదు, లెక్కల మాష్టారు. గొప్ప భక్తుడూ కాదు. అయినా పోతన భాగవత పద్యాలతనికి కంఠగతం, హృద్గతం. ఎలా? అది తెలుగు పద్యంలో, పోతన రచనలో ఉన్న గొప్పదనం. సామాన్య తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కొద్దిమంది కవులలో పోతన ఒకడు.

"రావే ఈశ్వర", "కావవే వరద" అన్న పదాలలో నిండిన ఆర్తి అనితర సాధ్యం.

పోతన భాగవతంలోని పద్యాలని మన పిల్లలకి అందించడం ఒక్కటీ చాలు, తెలుగుభాషని సంరక్షించుకోడానికి!

9 comments:

  1. అద్భుతమయిన పద్యం, పోతన పద్యాలలోని సౌందర్యం అద్భుతం, మీరు చెప్పినట్టు చిన్నపిల్లలందరిచేతా ఈ పద్యాలు చదివించాలి, (చాలా మంది పెద్దలకు కూడా తెలియవనుకోండి...)

    ReplyDelete
  2. guruvu gAru,
    nEnu mI pAta padyaLu cUsi, "alugutayE eruMgani".. padyam kOsaM edurucUstunnAnu. mIru I padyaM iccAru....
    ilAgE vIlainni padyAlu mAku aMdicamani manavi
    -vookadampudu
    http://vookadampudu.wordpress.com

    ReplyDelete
  3. వ్యాఖ్యానం చాలా బాగుంది మాస్టారూ. మీకు వీలైనప్పుడు - 'ఘన సింహంబుల కీర్తి' పద్యానికి మీ వ్యాఖ్యానం చెబితే వినాలనుంది.

    ReplyDelete
  4. రానారే గారు,
    మీరన్నది (భాగవతంలోని)రుక్మిణీకల్యాణంలోని పద్యమేనా? మీకాపద్యమంటే ఎందుకిష్టమో మీరే బ్లాగితే బాగుంటుంది:-)

    ReplyDelete
  5. బాగుందండీ మీ వ్యాఖ్యానం... నాకు భాగవతం చదవాలి అన్న కుతూహలం కలుగుతోంది మీ టపాలు చదువుతూ ఉంటే... అంటే, నాకు అర్థమవదు అనుకోండి... ఇలాంటి వ్యాఖ్యాన సహిత భాగవతం దొరికితే చదువుతా :)

    ReplyDelete
  6. malli na thalli odillo cherinattuga undhi.,

    ReplyDelete
  7. భాగవతంలో ఒక వుత్తమ భక్తి సన్నివేశాన్ని పోతనగారు యథార్తంగా మనకు వివరించారు. ప్రపంచం వున్నంత వరకు నిలిచి వుంటుందనడంలో ఏ మాత్రం సందేహము లేదు.

    ReplyDelete
  8. చిన్నప్పుడు మా తెలుగు టీచర్ తప్పనిసరిగా కంఠతా పట్టించిన భాగవత పద్యాలు... ఇప్పటికీ విన్నప్పుడు గానీ చదివినపుడు గానీ మనసంతా పులకరింప చేస్తాయి 🙏

    ReplyDelete
  9. 😊🙏🙏🙏 ధన్యవాదాలు

    ReplyDelete