తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, December 22, 2011

పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం!

భార్య పాదతాడనం రుచిచూసిన దేవుడనగానే మనకి గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడొక్కడే. అదికూడా, మన నంది తిమ్మనగారి పుణ్యమా అని తెలుగు కృష్ణుడికి మాత్రమే దక్కిన భాగ్యమది. మరి టపా శీర్షికలో "దేవుళ్ళు" అని బహువచనమేమిటి? మరో దేవుడు కూడా భార్య చేత తన్నించుకున్నాడా?! అన్న అనుమానం ఈపాటికి మీకు కలిగుండాలి. అవును, భార్య చేత తలదన్నించుకున్న దేవుడు మరొకడున్నాడు. అసలు నంది తిమ్మనగారి కృష్ణుడికి స్ఫూర్తినిచ్చింది కూడా ఆ దేవుడే అని నా నమ్మకం. అతనెవరో ఆ సందర్భమేమిటో తెలుసుకొనే ముందు, నంది తిమ్మనగారి పారిజాతాపహరణ కావ్యంలో మనందరికీ పరిచయమైన పద్యాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు గన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్
దొలగన్ ద్రోచె లతాంగి, యట్లయగు, కాంతుల్ నేరముల్ సేయ పే
రలుకన్ బూనినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే!

ఈ సన్నివేశాన్ని ఎరుగని వారుండరు కదా. పారిజాతాపహరణ కావ్యం గురించి తెలియకపోయినా, శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో "అలిగితివా సఖీప్రియా..." పాట, చాలామందికి తెలిసే ఉంటుంది. నారదుడు తెచ్చి యిచ్చిన పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా రుక్మిణికి యిచ్చాడని సత్య అలకబూనుతుంది. ఆమె అలక తీర్చే ప్రయత్నంలో చివరికి ప్రేమతో ఆమె కాళ్ళకి మ్రొక్కుతాడు శ్రీకృష్ణుడు. సత్యభామ చిగురులవంటి పాదాల ఎఱ్ఱని వెలుగులు తన కిరీటములోని మణికాంతులకి వన్నెపెట్టే విధంగా తలవంచి ఆ పాదాలని మ్రొక్కాడట! నిజంగా తానేదో అపరాధం చేసేశానన్న పశ్చాత్తాపంతోనా? అబ్బే! కృష్ణుడంటే ఎవరు? జగన్నాటకసూత్రధారి. అదంతా ఆయనకొక లీక. శృంగారలీల. అప్పుడేమయ్యింది? అతడు కోరుకున్నదే జరిగింది! బ్రహ్మేంద్రాది దేవతలచేత పూజింపబడే ఆ తలని తన ఎడంకాలితో త్రోసేసిందా భామ.

పద్యాలలో పదాలని ఆచితూచి వెయ్యడంలో దిట్ట నంది తిమ్మన. బ్రహ్మేంద్రాది దేవతలచే పూజింపబడేది అని చెప్పి ఊరుకో లేదు చూసారా. అది "లతాంతాయుధు కన్నతండ్రి" శిరసు అని కూడా మనకి గుర్తుచేసారు. అక్కడుంది కీలకం! లతాంతము అంటే లత చివరల పూచేది, పువ్వు అని అర్థం. లతాంతాయుధుడంటే సుమశరుడయిన మన్మథుడు, శృంగారదేవత. అతని తండ్రి అంటే సర్వ సృష్టిలోని శృంగారానికి కారణభూతమైన వాడన్న మాట. దీనివల్ల మనకి ధ్వనిస్తున్న విషయమేమిటి? సత్యభామ చేష్టని శృంగార రస దృష్టితోనే చూడాలి తప్ప ఏదో పరమపూజనీయమైన ఆ శిరసుకి అవమానం జరిగిందని భావించకూడదు సుమా అని కవి మనలని హెచ్చరిస్తున్నాడు. ఆ శిరసు ఎంతటి పూజనీయమైనదైనా కావచ్చు. కాని ఆ సన్నివేశంలో అది మన్మథ జనకుని శిరసు. శ్రీకృష్ణుడు  శృంగారనాయకుడు. ఆ చేష్ట శృంగారలీల. అందుకే ఆ తాకిడికి శ్రీకృష్ణుడు "ఉద్దీపిత మన్మథ సామ్రాజ్యాన్ని" పొందాడని తర్వాతి పద్యంలో అంటాడు తిమ్మన.  పైగా, తన్నినది ఎవరు? "లతాంగి". అతను లతాంతాయుధు కన్నతండ్రి, ఈమె లతాంగి. పొత్తు సరిగ్గా కుదరింది. లతలాంటి మేను ఎంత సున్నితంగా ఉంటుంది! అందుకే ఆ తాకిడికి ఆయనగారి మేను పులకించింది. ఆ పులకల ములుకులు ఆమె పదపల్లవానికి గుచ్చుకుంటే ఎక్కడ నొప్పి కలుగుతుందోనని తెగ బెంగపడ్డాడట ఆ కపట గోపాలుడు! ఆమె "నెయ్యపు కినుక"తో ("ప్రణయకోపాని"కి ఎంత ముచ్చటైన తెలుగు పదం!), తనని తన్నినా అది మన్ననే అని కూడా అంటాడు. అదంతా ఒక రసరమ్య విలాసం. దాన్ని తన ముద్దుముద్దు పలుకులతో మనోహరంగా చిత్రించాడు నంది తిమ్మన.

చెలునికి నెచ్చెలి కాలితాపు అనుగ్రహించడమన్నది పూర్వకాలంలో ప్రసిద్ధమైన విషయం లాగానే అనిపిస్తుంది.  దీని గురించి చాలా రిసర్చికూడా జరిగినట్టుంది! :) వాత్స్యాయనుడు నాయికా పదప్రహరణనాన్ని శృంగారలీలగా సూత్రీకరించాడు. వాత్స్యాయుని వ్యాఖ్యానించిన జయమంగళుడైతే ఏకంగా "క్రోధ వశాత్తస్య శిరసి పాదతాడనమపి నదోషాయ సౌభాగ్య చిహ్నం తదితి నాగరకవృద్ధాః" అన్నాడు. ఆలంకారికులు కూడా దీన్ని గురించి ప్రస్తావించారు. సాహిత్యదర్పణంలో విశ్వనాథ కవిరాజు రూపకాలంకారానికి యిచ్చిన ఉదాహరణ చూడండి:

"దాసే కృతాగసి భవత్యుచితః ప్రభూణాం పాదప్రహార ఇతి సుందరి నాస్మి దూయే, ఉద్యత్కఠోర పులకాంకుర కంటకాగ్రై ర్యద్భిద్యతే మృదుపదం నను సా వ్యథా మే"
(శ్లోకం  ఛందస్సు గుర్తుపట్టారా?!)

ఈ శ్లోకం రెండవ భాగానికి ఇంచుమించు తెలుగుసేతే మనందరికీ బాగా తెలిసిన ఈ పద్యం:

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్క బూని తా
చిన, యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్రకంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా! 

దేవుళ్ళైనా దేవుళ్ళాడేంత మహత్తు దీనిలో ఉన్నదంటే ఇంక సామాన్యుల మాటేం చెపుతాం! ఇంతకీ ఆ రెండో దేవుడెవరో ఆలోచించారా? కనిపెట్టారా? అబ్బా ఆశ! అప్పుడే చెప్పేస్తే మజా ఏముంటుంది. అది తెలియాలంటే తదుపరి టపాకోసం ఎదురుచూడండి మరి. :-)

(తెలిసిన వాళ్ళు గుట్టు రట్టు చెయ్యకుండా, ఈ టపాకి వ్యాఖ్యలని మోడరేట్ చేస్తున్నానోచ్!)

10 comments:

  1. కృష్ణుడు కాక మరొక దేముడెవరా అని ఆలోచించాను గాని సరైన సమాధానం దొరకలేదు. విష్ణువుగాని, శివుడుగాని అయిఉండొచ్చని ఊహ, కానీ ఏ సందర్భమూ/కథా గుర్తు రావడం లేదు. 'గంగావతరణం' కొంతమటుకు క్వాలిఫై కావచ్చును. కథలేకుండా కేవలమూ కవి ఊహని మాత్రమే తీసుకుంటే -

    మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితమ్
    లలాటే భర్తారమ్ చరణకమలే తాడయతి తే
    చిరాదన్తశ్శల్యం దహనకృతమున్మూలితవతా
    తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా ||

    ReplyDelete
  2. వేంకటేశ్వరుడు ??

    ReplyDelete
    Replies
    1. శ్రీ కృష్ణ దేవరాయలు .

      Delete
  3. ఆశగారు, కృతజ్ఞతలు.
    సనత్‌గారు, ఏ సందర్భంలో?
    నాగమురళిగారు, మీ ఊహ సరి కాబట్టి మీ వ్యాఖ్య కత్తిరించబడినది. :)

    ReplyDelete
  4. sir...where is the next part of this post...?

    ReplyDelete
  5. శ్రీకృష్ణ 'దేవ' రాయలే కదూ

    ReplyDelete
  6. క్రితం ఏడాది చింతారామకృష్ణారావు గారింట్లో శంకరయ్యగారు, గన్నవరపుమూర్తిగారు, సనత్తూ నేను కలుసుకొన్నప్పుడు సనత్ మా అందఱి చేతా తలొక పద్యము చదివించాడు. అప్పుడు నేను అందుకున్న పద్యం జలజాతాసన యే. నేను నేర్చుకున్న పాఠములో రెండు తాడాలున్నాయి చూడండి.

    నాథుల్ నేరముల్ సేయ పేరలుకన్ జెందినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే

    ReplyDelete
  7. ఆశగారు, తరువాయి భాగం ప్రచురించబడింది.
    గిరిగారు, కృష్ణదేవరాయల విషయం పుక్కిటి పురాణమే కాని దానికి కావ్య గౌరవం దక్కలేదు :-). బహుశా మీరు చెప్పిన పాఠమే సరికావచ్చు. నేను నాకు గుర్తున్నది వ్రాసాను, పుస్తకంలో సరిచూడలేదు.
    నాగమురళిగారు, సరిగా గుర్తించినందుకు అభినందనలు. కృష్ణుని విషయంలో కూడా అది కేవలం కవి ఊహే కదా! :-)

    ReplyDelete
  8. Nice to read this Telugu padyam after 50yrs the comments & meaning of the padyam are wonderful . Thanks for the participants

    ReplyDelete