తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, November 5, 2010

దీపావళి శుభాకాంక్షలు!

దీపావళి శుభాకాంక్షలు!
శుభాకాంక్షల కోసమే ఈ బ్లాగన్నట్టుగా తయారయ్యిందీ మధ్య.:-) అసలు, పండగల ముఖ్య ప్రయోజనాల్లో ఇదొకటి. మనిషి మరీ ఒంటరివాడైపోకుండా నలుగురినీ కలపడం కోసం. సరే "ఈ" కాలంలో అవి "ఈ-కలయికలుగా" మారడం సహజమే కాబోలు! ఇంటిదగ్గర ఉండుంటే ఈపాటికి టపాకాయల హడావిడిలో ఉండేవాణ్ణి! తారాజువ్వలు తప్పనిసరి. ఒక్కో పండక్కి ఒకో ప్రత్యేకత! సరదాగా జరుపుకొనే పండగల్లో మాత్రం దీపావళిదే అగ్రస్థానం.

చారిత్రకంగా పండగల పుట్టుపూర్వోత్తరాలు వాటి సాంఘిక మూలాలు మొదలైనవి పక్కన పెడితే, వాటి గురించిన కథలు భలే విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకి ఈ దీపావళి పండగే తీసుకోండి. మనందరికీ బాగా తెలిసిన కథ నరకాసుర వథ. శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై యుద్ధం చేసి నరకాసురుణ్ణి సంహరిస్తే ప్రజలందరూ ఆనందంగా మర్నాడు దీపావళి జరుపుకోవడం ఈ పండగ పుట్టుకకి కారణంగా చెప్తారు. కృష్ణుడో, విష్ణుమూర్తో, శివుడో - ఎంతమంది రాక్షసులని చంపలేదు! మరి నరకుడిని చంపినందుకు మాత్రమే మనం ఎందుకు పండగ జరుపుకుంటున్నాం? మన ఆనందానికి సూచనగా దీపాలని (దీపాలంటే కృత్రిమమైన విద్యుత్తు దీపాలు కాదు, సహజమైన చక్కని ప్రమిద దీపాలు) ఎందుకు వెలిగిస్తున్నాం? బాణాసంచా ఎందుకు కాలుస్తున్నాం? ఇవన్నీ ఆలోచిస్తే భలే వింతగా అనిపిస్తాయి. సరదాగా పండగ జరుపుకోక ఈ ప్రశ్నలన్నీ అవసరమా అంటే కాదు. అయినా ఏదో బుద్ధి అన్నది ఉన్నందుకు ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడైనా తలెత్తకుండా ఉండవుకదా. రాక్షసుడి చావుని పండగ్గా జరుపుకొనేది ఒక్క దీపావళికే అనుకుంటా!

నరకాసుడి కథ గురించి విశ్వనాథ సత్యనారాయణగారు ఒక ఊహ చేసారు. నాచన సోమన ఉత్తరహరివంశాన్ని గురించిన విమర్శ "ఒకడు నాచన సోమన" అనే పుస్తకంలో తన ఊహని ప్రతిపాదించారు. అదేమిటంటే, భూమినుంచి బద్దలై విడిపోయిన ఒక పెద్ద గోళానికి నరకుడు ప్రతీక అనీ, ఆ గోళం తన గతి తప్పి భూమ్మీద పడిపోడానికి దూసుకువస్తే, కృష్ణుడు దాన్ని తునాతునకలు చేసి భూమిని రక్షించాడనీ. చంద్రుడు భూమి ఏర్పడే కొత్తలో విడిపోయిన గోళమని అంటారు కదా. అలాగే మరొక ముక్క విడిపోయుండేందుకు అవకాశం లేకపోలేదు. అది చంద్రుడిలా చక్కగా భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పోకుండా, భూమ్యాకర్షణకి భూమ్మీదకి వచ్చిపడే అవకాశమూ ఉంది. ఏదో ఇంగ్లీషు సినిమాలో పెద్ద మీటియర్ భూమ్మీద పడబోతూ ఉంటే, దాన్నుంచి భూమిని రక్షించే ప్రయత్నం చెయ్యడమే కథ. నరకాసురుడిది కూడా అలాంటి కథే అని విశ్వనాథ వారి ఊహ. ఈ ఊహకి కారణాలు ఏంటంటే, ఒకటి - నరకుడి నగరం ప్రాగ్జ్యోతిష పురం కావడం. జ్యోతిషమంటే అంతరిక్షంలోని నక్షత్రాలకి సంబంధించినదని అర్థం. ప్రాక్ అంటే తూర్పు దిక్కు. ఈ రెండు పదాలు కలిపిన ప్రాగ్జ్యోతిషం అంతరిక్షంలో భూమికి తూర్పుగా ఉండే ప్రదేశాన్ని సూచిస్తుందని అనుకోవచ్చు కదా. నరకుడి నివాసం అక్కడంటే అతడు ఏ గ్రహమో అయ్యేందుకు అవకాశం ఉంది. రెండో కారణం. నరకుడు, విష్ణువు వరాహావతారంలో భూమిని రక్షించేటప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టిన వాడు. వరాహావతారానికి కృష్ణావతారానికీ మధ్య కొన్ని మన్వంతరాల తేడా ఉంది. నరకుడు మనిషే (రాక్షసుడైనా) అయితే అన్నాళ్ళు బతికుండే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నాడనుకున్నా అన్ని కోట్ల సంవత్సరాలుగా ఊరుకొని కృష్ణుడు అవతరించేదాకా జనాలని పీడించకుండా ఉన్నాడా? ఈ ప్రశ్నలకి నరకుడు ఒక గోళం అని చెప్పుకుంటే సమాధానాలు సులువుగా దొరుకుతాయి. నాచన సోముడు కూడా ఇలాగే ఊహించాడాని విశ్వనాథవారి ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు తన చక్రంతో నరకుడిని వ్రక్కలు (తునాతునకలు) చేసాడని రెండుసార్లు నొక్కి మరీ చెప్పాడు నాచన. మామూలు మనిషైతే చక్రంతో తల నరికితే సరిపోతుంది కదా. తునాతునకలు చెయ్యడం దేనికి? అదే గోళమైతే ఏదైనా బాంబుపెట్టి పేల్చినట్టు చక్రంతో దాన్ని ముక్కచెక్కలు చేసే అవకాశం ఉంది. ఇదంతా ఊహే కావచ్చు. కాని సహేతుకమైనది. ఆర్య-ద్రవిడ లేదా జాతి/కుల వైరాన్ని ప్రతిపాదించే విద్వేష కారకమైన ఊహలకన్నా మేలైన ఊహ.

దీపాలు వెలిగించడం, బాణాసంచా కాల్చడం అన్నది బహుశా ఈ కథకి సంబంధం లేని ఆచారం. దీపావళి అమావాస్య తర్వాత రోజునుండీ కార్తీక మాసం మొదలవుతుంది. అంటే చంద్రుడు కృత్తికలో ఉండే నెల. కృత్తికని అగ్ని నక్షత్రం అంటారు. దానికి సూచనగానే బహుశా ఆ నెలంతా దీపాలు వెలిగిస్తారేమో. దీపావళి దానికి శ్రీకారం చుడుతుంది.

నరకాసురడి కథ పురాణాల్లో కావ్యాల్లో ఉంది కాని దీపావళి పండగ ప్రసక్తి తెలుగు కావ్యాల్లో ఎక్కడైనా ఉందేమో నాకు తెలీదు. నరకాసుడి కథ అనగానే గుర్తుకువచ్చేది మాత్రం సత్యభామ యుద్ధం, అందులోని ఈ పద్యం:

అరిజూచున్ హరిజూచు జూచుకములం దందంద మందార కే
సరమాలా మకరంద బిందు సలిలస్యందంబు లందంబులై
తొరగం బయ్యెదకొంగొకింత దొలగన్ దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీ గతిన్

ఈ పద్యం గురించి కొద్దిపాటి వివరణ ఇక్కడ వ్యాఖ్యల్లో చూడవచ్చు: http://www.eemaata.com/em/issues/200901/1386.html?allinonepage=1

అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. టపాకాయలతో పిల్లకాయలతో జాగ్రత్త సుమా!

8 comments:

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. భలే.మంచి ఐడియా! ఈ కథకీ దీపాలు కనెక్టడే. మొత్తానికి ప్రమాదం తప్పిందని సంబరాలు చేసుకున్నారు అంతే :)

    దీపావళి శుభాకాంక్షలు.

    కాంతికణం చదవలేకపోతున్నాను. మీరు దానికి ఆహ్వానితులా? ఏదన్నా మార్గం ఉందా?ప్లీజ్.

    ReplyDelete
  3. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు

    ~సూర్యుడు

    ReplyDelete
  4. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు

    ReplyDelete
  5. మీ వ్యాసం చూసేప్పటికి దీపావళి జరిగిపోయింది. అయినా శుభాకాంక్షలు. మొన్నామధ్య నేను చూసిన కథకళి కథలో నరకుడి కూతురు ప్రస్తావన వచ్చింది. (ఆంగ్లంలో కథ ఉన్న షీట్ అందరికీ పంచారు). కథకళి ఇతివృత్తాలు సంస్కృత సాహిత్యం నుండీ స్వీకరిస్తారు కాబట్టి, ఆ కథా ఎక్కడో ఉండి ఉండాలి!

    కృష్ణుడు కాబట్టి చక్రంతో ముక్కలు చేశాడు. అదే బాలకృష్ణ అయితే కాలితో తన్ని ఆ గ్రహాన్ని కొన్ని మైళ్ళు..కాదు కాదు..కొన్ని కాంతి సంవత్సరాల దూరానికి కొట్టి పడేసి ఉండేవాడు.

    ReplyDelete
  6. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. ఊహ బాగున్నది.

    ReplyDelete
  7. hi happy deepavali

    ReplyDelete