తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, February 17, 2008

ముందుగ వచ్చితీవు...

ఈ రోజు మళ్ళీ తిరుపతివెంకటకవులదే ఇంకొక పద్యాన్ని తలుచుకుందాం:

ముందుగ వచ్చితీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్
బందుగులన్న యంశమది పాయకనిల్చె సహాయ మిర్వురున్
జెందుట పాడి, మీకునయి చేసెద సైన్య విభాగ మందు మీ
కుం దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు ముందుగన్

ఈ పద్యంలోని గొప్పదనం తెలియాలంటే అది వచ్చే సందర్భాన్ని ఒక్కసారి సింహావలోకనం చెయ్యాలి.
కౌరవ పాండవులకి యుద్ధం నిశ్చయమైపోతుంది. సైన్య సమీకరణంలో భాగంగా, కృష్ణుణ్ణి తనవైపుకు తిప్పుకోవాలన్న ప్రయత్నంతో దుర్యోధనుడు స్వయంగా కృష్ణుని వద్దకు బయలుదేరుతాడు. అది తెలుసుకుని ధర్మరాజు అర్జునుణ్ణి కృష్ణుడి వద్దకు పంపిస్తాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి చేరుకుంటారు. దుర్యోధనుడు కాస్త ముందువస్తాడు. కానీ కృష్ణుడి తలదగ్గరున్న ఆసనంలో కూర్చోడంతో, కాళ్ళదగ్గరున్న అర్జునుణ్ణి ముందుచూస్తాడు కృష్ణుడు. తను ముందొచ్చాను కాబట్టి, తనకే సాయంచెయ్యాలంటాడు దుర్యోధనుడు. ఇదీ సందర్భం. కృష్ణుడు తన మాటల చాకచక్యాన్నంతా చూపించే పద్యమిది. పద్యం చూడ్డానికి సాధారణంగా ఉన్నా, ఇలాటి పద్యం రాయడం కష్టం. తనకి మాత్రమే సాయం చెయ్యాలన్న దుర్యోధనుడితో, అర్జునుడికి భాగం ఇవ్వడమే కాక, ముందుగా అతనికే కోరుకొనే అవకాశం కలిగిస్తానని చెప్పాలి, చెప్పి ఒప్పించాలి. అదంతా ఒక్క పద్యంలో! అందుకే ఈ పద్యం ఈ మొత్తం ఘట్టానికంతా కీలకమైన పద్యం. తిక్కన ఈ సందర్భంలో మూడు నాలుగు పద్యాలు రాసాడు. తన సైన్య భాగాల గురించి చెప్పి, తర్వాత అర్జునుడు బాలుడు కాబట్టి ముందతన్ని కోరుకోమని అంటాడు కృష్ణుడు భారతంలో. ఇక్కడ, సైన్య భాగాలగురించి వివరించకముందే, ఈ పద్యంలో అర్జునుడు బాలుడు కాబట్టి ముందతను కోరడమే సమంజసమని నిర్ణయిస్తాడు. ఇదొక విధంగా దుర్యోధనుడికి ఉత్కంఠను రేపుతుంది.

"అసలు అర్జునుడికి ముందు కోరుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? దుర్యోధనుడికి ముందవకాశం వచ్చినా సైన్యాన్నే కోరుకుంటాడు కాని యుద్ధం చెయ్యని కృష్ణుణ్ణి కోరుకోడుకదా?", అన్న అనుమానం రావచ్చు.
దీని వెనక రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి, దుర్యోధనుడు కాస్త తెలివి ఉపయోగించి కృష్ణుణ్ణి కోరుకుంటే, పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అలా కోరుకోడానికి అవకాశం లేకపోలేదు. దాన్ని నివారించడం ఒకటి. అంతా కన్నా ముఖ్యమైనది అర్జునుడి భక్తికి పరీక్ష. మొత్తానికీ పరీక్షలో అర్జునుడు నెగ్గుతాడు. దుర్యోధనుడు కూడా చివరికి తనకే మేలు జరిగిందని సంతృప్తుడౌతాడు! విపత్కర పరిస్థితిలో, win-win పరిష్కారాన్ని చూపించిన కృష్ణుని నేర్పు, ఈ కాలంలో negotiation skillsకి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు!

పాడి, ఒప్పు లాంటి అచ్చ తెలుగు మాటలతో హాయిగా సాగిపోయే ఈ పద్యం, "ముందుగ" అన్న పదంతో మొదలై, అదే పదంతో పూర్తికావడం ఒక శిల్ప విశేషం.

6 comments:

  1. మీ కోసం బాగుతో మొదలు పెట్టి లెస్సతో పూర్తి చేసివ గీత పద్యమొకటిదిగో..

    తే.గీ. బాగు బాగు, భైరవభట్ల బ్లాగు, మంచి
    పద్యములనేరి కూర్చుతు, వ్యాఖ్యలు కడు
    నేర్పు తోడ వ్రాయుచు, మాకు నేర్పుచుంటి
    రిటుల మంచి విషయములు, లెస్స లెస్స !

    ReplyDelete
  2. పాండవోద్యోగం లో పద్యాలన్నీ అద్భుతంగా ఉంటాయి, అందులోనూ రాయబారం నాటకంలో పద్యాలు తెలుగు పల్లెలన్నింటిలో మారుమ్రోగాయి, ఇప్పుడు ఎంతమందికి తెలుసో...

    ReplyDelete
  3. నెనరులు గిరిగారూ, మీ
    యనుమోదమ్మిట్లు గీతమై మురిపించెన్!
    మనసున దోచినవేవో
    చినచిన్న విశేషములను చెప్పెదనంతే!

    ReplyDelete
  4. ఇంత ఫాలోయింగ్ ఉంది అన్నయ్య ఇంత అని చెప్పలేనంత బాగుంది అన్నయ్య

    ReplyDelete
  5. మీ మేధాశక్తి కి వంద వందనాలు.

    ReplyDelete