తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, February 12, 2008

చెల్లియొ చెల్లకో...

"మంచిపద్యంతో కొంచెంసేపు" అన్న విభాగంలో వీలుచిక్కినప్పుడల్లా నాకు నచ్చిన పద్యాలగురించి రాయాలని ఆలోచన. మొదటిగా ఏ పద్యం గురించి రాద్దామా అనుకుంటే వెంటనే తట్టిన పద్యం ఇది.

చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి, గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో
ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!


ఈ పద్యం గురించి తెలియని తెలుగువాళ్ళు అరుదే కదా! ఇది అందరికీ సులువుగానే అర్థం అవుతుంది కూడానూ! అదే దీని గొప్పతనం. ఇరవయ్యవ శతాబ్దంలో తెలుగు పద్యానికొక కొత్త ఊపిరినిచ్చి, ప్రజలమధ్యకి తీసుకెళ్ళినవాళ్ళు తిరుపతివెంకట కవులు. అవధానాల సాముగారడీలతో ఆగిపోక, గొప్ప నాటకాలూ మంచి కావ్యాలు రాసి కవులనిపించుకున్నారు.
ముఖ్యంగా తెలుగు పద్యంలో - నాటకీయతనీ, సంభాషణలో కాకువునీ, వ్యవహార భాషనీ ప్రదర్శించే తీరులో తిక్కనంత ప్రజ్ఞని కనబరిచారు. అందుకే వాళ్ళ పాండవోద్యోగ విజయాలు అంత ప్రజాదరణ పొందాయి!
ఈ పద్యమే అందుకు మంచి ఉదాహరణ. పద్యం ప్రారంభించటంతోనే, "చెల్లియొ చెల్లకో" అనడంలో మామూలుగా సంభాషించుకునే తీరు (అయిందేదో అయింది అన్నట్టుగా) మనసుకు హత్తుకుంటుంది. సంధి చేస్తే నీ పిల్లలూ పాపలూ ప్రజలూ చక్కగా ఉంటారు అని చెప్పడంలోనే యుద్ధం చేస్తే వాళ్ళందరూ నాశనమౌతారని అన్యాపదేశంగా చెప్పడంలోని గడుసుతనం చూడండి! "ఎల్లి" అంటే రేపు అని అర్థం. "ఎల్లుండి"లో(రేపు తర్వాతి రోజు) ఉన్న ఎల్లి ఇదే.
అలతి పదాలతో, సంభాషణా శైలిలో, నాటకీయత ఉట్టిపడే అందమైన పద్యం!
ఈ నెల పదిహేనో తారీకున చెళ్ళపిళ్ళవారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈ రూపంలో నా నివాళి...

13 comments:

  1. చాలా సంతోషం సార్. మరిన్ని మంచి పద్యాలను పరిచయం చేయండి. తెలుగు నెజ్జనులను అలరించండి.

    ReplyDelete
  2. padyaalanu andinche manchi alochana meeku vachinanduku meku abhinandanalu. mee nunchi marinni manchi padyalanu ashishtunnam.

    ReplyDelete
  3. ఈ పద్యం చూడగానే బాల్యం గుర్తొచ్చింది. మా చిన్నప్పుడు, నాటకాలు జరిగేవి విరివిగా మా వూళ్ళోని. అక్కడ ఈ పద్యం, జండా పై కపిరాజు, ముందుగ వచ్చితీవు, వగైరా, వగైరా బాగా పాపులర్. రాయబార్మ్ పద్యాలు అంటాం వీటిని మేము.

    ReplyDelete
  4. గొడ్డకాడ బుడ్డోళ్ళ చేత కూడా పాడించారు మన తిరుపతి వెంకట కవులు,అదీ ఈ పద్యాల గొప్పతనం,వారివే ఇంకా ఎన్నో పద్యాలు,ముఖ్యంగా రాయబారం లో వి ఉన్నాయి.అలాగే కాటిసీను,జాషువాపద్యాలు,చింతామణి ఇలా చాలా పరిచయం చేయాలి మాకు మీరు.వేమన మాట మరవకండి భైరవభట్ల గారు.

    ReplyDelete
  5. ఓ వ్యాఖ్య రాసాను, కనబడలేదు - బాగుంది, ఇలానే కొనసాగించండి...

    ReplyDelete
  6. ఈ పద్యం కవిత్రయపు భారతంలోని దనుకొన్నాను మీరు చెప్పేదాక. ఎల్లి అంటే చెప్పారు, థాంక్యూ. రేపు, ఎల్లుండి అనడానికి బదులుగా రాయలసీమ జిల్లాల్లో రేపు, మొన్నాడు (మరునాడు) అంటారు. "ఏర్పడ జెప్పుము" అన్నారు కదా, "ఏర్పడ దెల్పుము" అని విన్నాను. 'దెల్పుము'తో ఛందస్సుకేమీ భంగం లేదు కదా!?

    ReplyDelete
  7. చదివి ప్రోత్సహిస్తూ నాలుగు మంచి మాటలు రాసిన పాఠకులందరికీ నెనరులు.
    బహుశా నాకు కంఠస్థమైన మొదటి తెలుగు పద్యం ఇదే (నాకు గుర్తున్నంత వరకూ). చిన్నప్పుడు మా నాన్నగారు పాడుతూ రాయబారం, పడక సీను (రవిగారన్న "ముందుగ వచ్చితీవు" పద్యం ఇందులోది), కృష్ణ కర్ణ సంవాదం పద్యాలు మాకు నేర్పించారు. నాటకానికి వెళ్ళిచూడ్డం, సినిమాలో చూడ్డం ఆ తర్వాతే.
    రానారే గారూ, "ఏర్పడ దెల్పుము" అన్నా ఛందస్సు సరిపోతుంది. కానీ "తెల్పుము", "చెప్పుము" కన్న ఒక్క పిసరు ఎక్కువ గ్రాంధిక వాసన కొడుతుంది.

    ReplyDelete
  8. చాలా బాగా వ్రాస్తున్నరండి!! మీలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది. మీరు ఇలాగే మంచి పద్యాల గురించి వ్రాస్తుండండి. మరొక్క విషయం మరవకండి!! మీ "ఛందస్సు, కమామీషు!" ని చాలా మంది చదువుతూనే ఉండొచ్చు! మీరు మాత్రం దానిని అపకండి!
    -సత్తిబాబు.

    ReplyDelete
  9. చెల్లియో చెల్లకో పద్యం యొక్క అర్థం కూడా ఇస్తే బాగుండును కదా

    ReplyDelete
  10. @విజయభాస్కర్ గారు,
    ఎగ్గు అంటే అపకారం. సైసిరి అంటే భరించారు.

    "మీరు వాళ్ళకి చేసిన అపకారాలని ఎదుర్కోగలిగో,లేకో మొత్తానికి భరించారు ఇంతదాకా. గతించె - అయిందేదో అయింది. నన్నిప్పుడు దూతగా సంధి చెయ్యడానికి పంపించారు. నీ పిల్లాపాప చక్కగా ఉండాలంటే సంధిచెయ్యి. అలా చేస్తావో, రేపు యుద్ధానికే సిద్ధపడతావో ఇప్పుడు తేల్చి చెప్పు."

    ఇదండీ అర్థం!

    ReplyDelete
  11. తెలుగుజాతిని ఉర్రూతలగించాయి ఈ పద్యాలు ఇప్పటికీ వాటి గొప్పతనం తగ్గలేదు తగ్గదు కూడా కోతి ఇంగ్లీష్ప్పాద్యాలు ఒక్కటైనా ఈ ఒక్క పద్యానికి సమం కావు

    ReplyDelete
  12. ప్రస్తుత విడాకుల vypareetyaaniki అద్దం పడుతున్నది కూడా ఈ పద్యం

    ReplyDelete